(Railway Platform Ticket) సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులపై ఛార్జీలు విధించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సిద్ధమైంది. ప్లాట్ ఫాం టిక్కెట్ రేటును పెంచేసింది. టిక్కెట్ ధరను ఏకంగా రూ.10 కు పెంచుతూ ఎస్సీఆర్ నిర్ణయం తీసుకున్నది. పండగ వేళ ప్లాట్‌ఫాంలపై రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు సెలవిస్తున్నారు.
ఇవాల్టి నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం చార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా.. దానిని రూ.20 గా చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే పీఆర్వో రాకేశ్ చెప్పారు. జన సమూహం ప్లాట్‌ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకుగాను ఈ చార్జీలను పెంచినట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు.