తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాసం(Karthika masam) శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం నిర్వహించిన పుష్పయాగం(Pushpa Yagam ) తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వేదమంతోచ్ఛరణల మధ్య పుష్పార్చన నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం (Snapana Tirumanjanam) వేడుకగా జరిపారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. పుష్పయాగం సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. నిన్నటి నుంచి సిఫార్సు లేఖలను అనుమతించ లేదు. టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .