Viveka Murder Case | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై శుక్రవారం పులివెందుల అర్బన్ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి పీఏ క్రుష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై వేర్వేరు సెక్షన్ల కింద ఈ నెల 15న కేసు రిజిస్టర్ చేశారు. పులివెందుల కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి చార్జిషీట్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు చెప్పారు.
సీబీఐ ఎస్పీ రాం సింగ్.. వివేకా హత్య కేసు విచారణ సమయంలో తనను కొందరు వైసీపీ నేతల పేర్లు చెప్పాలని, ఈ కేసులో సాక్షిగా ఉండాలని ఒత్తిడి తెచ్చారని, విచారణ పేరిట సీబీఐ కార్యాలయానికి పిలిపించి తన కొడుకుల ముందే తీవ్రంగా కొట్టారని క్రుష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను బెదిరించారని ఆరోపిస్తూ 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల ఎనిమిదో తేదీన తీర్పు ఇచ్చింది.
సీబీఐ ఎస్పీ రాంసింగ్, వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై చర్య తీసుకోవాలని పులివెందుల కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వచ్చేనెల నాలుగో తేదీ లోగా తుది నివేదిక సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. సిట్ దాఖలు చేసిన రెండు నివేదికల ఆధారంగా 27 మంది సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానానికి సమర్పించారు.