అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.85 వేల కోట్లు పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది . ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 8న ఏపీలోని విశాఖ (Visaka) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటక ఖరారయ్యిందని జిల్లా అధికారులు వెల్లడించారు.
ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారని వివరించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో (Green Hydrogen Project) పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా ఏపీ నిలుస్తుంది.
భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 1200 ఎకరాలు కేటాయించింది. 600 ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 1100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని అధికారులు తెలిపారు. 300 ఎకరాల్లో ఎలక్ట్రోలైజర్లు, సోలార్ పీవీ, బ్యాటరీ స్టోరేజీల ఇండస్ట్రియల్ హబ్, మరో 300 ఎకరాలను మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు.