అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం(Achyutapuram) ఫార్మా సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో 17మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) గురువారం పరామర్శించారు. విశాఖ(Visaka) మెడికవర్, కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 లక్షలు పరిహారం అందజేస్తామన్నారు.