అమరావతి : ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండ ( Vinukonda) లో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ (Raseed) కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసీపీ కార్యకర్తగా ఉండడం వల్లే రాజకీయ కక్షతో చంపివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నిందితుడిపై అనేక కేసులున్నాయని వివరించారు. హత్య వెనుక టీడీపీ (TDP) పెద్దల హస్తం ఉందని వాపోయారు. తన కుమారుడితో ఎవరితోనూ పాత కక్షలు లేవని జగన్కు తెలిపారు. నిందితులను, వారికి సహకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 45 రోజుల్లో రాష్ట్రమంతా అతలకుతలం అయ్యిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై వైసీపీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలో వైసీపీ తరుఫున వచ్చే బుధవారం ధర్నా చేస్తామని ప్రకటించారు. దాడులతో భయందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మోసం చేస్తుందని ఆరోపించారు. అమ్మ ఒడి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీపరంగా రషీద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జగన్ ప్రకటించారు.