శ్రీశైలం : త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి ) బుధవారం విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. త్రయోదశి సందర్భంగా దేవస్థాన సేవగా ( సర్కారీ సేవగా) ప్రదోషకాలంలో కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని , పాడి సమృద్ధిగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు కలిగి, సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను నిర్వహించారు.
ఆ తర్వాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, శుద్ధ జలాలు, వేదమంత్రాలతో శాస్తోక్తంగా అభిషేకం చేశారు. స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించి, విశేష పుష్పాలతో అర్చించి.. నానబెట్టిన శనగలు నందీశ్వరస్వామికి సమర్పించారు. శనగల బసవన్న ఆరాధనతో సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, రుణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో తొలిసారిగా బసవన్న అభిషేకం పరోక్ష సేవ కార్యక్రమం నిర్వహించగా 95 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ప్రతి నెలలో శుద్ధ, బహుళ త్రయోదశి రోజుల్లో ప్రదోషకాలంలో సేవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల భక్తులు www.srisaladevasthanam.org లేదంటే www.tms.ap.gov.in వెబ్సెట్ల ద్వారా సేవకు రూ.1,116 చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు.