Prakasham Barrage | ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైఎస్ జగన్ కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయారని టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ మండిపడింది. నిందితులు ఇద్దరూ టీడీపీకి చెందిన వ్యక్తులే అని ఆరోపించింది. అడ్డంగా దొరికిపోయాక ఇంకెందుకు ఈ బుకాయింపులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రకాశం బ్యారేజీని కూల్చాలని కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయాక ఇంకెందుకు బుకాయిస్తున్నావని వైఎస్ జగన్‌పై టీడీపీ మండిపడుతూ ఒక ట్వీట్ చేసింది. ఈ పిరికోడికి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించింది. ఈ కేసులో అరెస్టయిన కోమటి రామ్మోహన్ అనే వ్యక్తి జగన్ రైట్ హ్యాండ్ వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు అని చెప్పింది. ఇక వక్కలగడ్డ ఉషాద్రి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ముఖ్య అనుచరుడని పేర్కొంది. వీళ్లకు టాస్క్ ఇచ్చింది వైఎస్ జగన్ అని తెలిపింది.
ప్రతి దొంగోడు దొరికిపోయాక తనకు సంబంధం లేదనే అంటాడని టీడీపీ మండిపడింది. ఈ సైకోల చేత నిజం ఎలా చెప్పించాలో పోలీసులకు తెలుసని విమర్శించింది. అన్యాయంగా ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని ప్లాన్ చేసి దొరికిపోయావ్ జగన్.. దుర్మార్గుడా.. నిన్ను ప్రజలు ఇంకా గెలిపించరని, ఇలా ద్వేషం పెంచుకుంటావా? అని మండిపడింది.
టీడీపీ చేసిన ఈ ట్వీట్‌పై వైసీపీ మండిపడింది. మీరు చెబుతున్న నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మోహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరామ్‌కు బంధువని తెలిపింది. రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే అని పేర్కొంది. నారా లోకేశ్‌తో కలిసి అతను సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయని.. ఆ బోట్లు నడుపుతోంది కూడా అతనే అని చెప్పింది.
కోమటి రామ్మోహన్ మైలవరం టీడీపీ టికెట్ ఆశించిన బొమ్మసాని సుబ్బారావుకు అత్యంత సమీప బంధువు అనే విషయం బయటపడేసరికి మీ డ్రామా మొత్తం రివర్స్ అయిపోయిందని వైసీపీ మండిపడింది. మీ చంద్రబాబుతో, దేవినేని ఉమతో బొమ్మసాని సుబ్బారావుతో కోమటి రామ్మోహన్‌కు ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ ఫొటోల్ని చూస్తేనే అర్థమవుతోందని తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫొటోలను ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేసింది. అడ్డంగా దొరికిపోయాక ఇంకెందుకు ఈ బుకాయింపులు అని టీడీపీపై మండిపడింది.