అమరావతి : తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సభ్యుల నియామకంపై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జగ శ్రావణ్‌కుమార్( Jada Shravankumar) తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చైర్మన్‌తో సహా అనేక కేసులున్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడం దేవాదాయ చట్టానికి విరుద్దమని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు.
అనేక క్రిమినల్(Criminal), ఐటీ (IT) ఎగవేత కేసులు, టీటీడీని దుర్భాషలాడిన వ్యక్తులకు అవకాశాలు ఇవ్వడం సబబు కాదని అన్నారు. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు క్యారేజీలు మోసి మునికోటేశ్వరావుకు, అలివేలు మంగమ్మను అవమాన పరిచిన నర్సిరెడ్డిలను బోర్డు సభ్యులుగా నియమించడం శోచనీయమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత గడిచిన ఐదు నెలల్లో వైసీపీ పాలననే గుర్తు చేస్తుందని విమర్శించారు.
గత టీటీడీ పాలకమండలిలో సభ్యుల నియామకంపై తరుచూ విమర్శలు చేసిన కూటమి నాయకులు నేడు అదే తప్పును చేశారని మండిపడ్డారు. కరకట్టపై అనధికారికంగా నిర్మించుకున్న ఇంటిని కూల్చివేయాలని నేషనల్ ట్రిబ్యునల్‌కు వెళ్తామని వెల్లడించారు. హైడ్రా వంటి చట్టం ఏపీలో అమలైతే ముందు పోయేది సీఎం చంద్రబాబు ఇళ్లు, తరువాత పవన్ ఇళ్లేనని పేర్కొన్నారు.