Posani Krishna Murali | వైఎస్ జగన్ పార్టీని ప్రజల కోసం స్థాపించారని.. పైసల కోసమే మెగా కుటుంబం పార్టీ పెట్టిందని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోసాని సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరని.. సీఎం జగన్ను తిట్టడం తప్పా ప్రజలకు ఏమైనా చేస్తామని చెబుతున్నారా ? అంటూ ప్రశ్నించారు.
జగన్ ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లినా మర్యాదగా మాట్లాడాతరని.. ఈ విషయాన్ని గమనించాలన్నారు. జగన్ జన నాయకుడు, ప్రజల వ్యక్తి అన్నారు. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ అనీ.. అకింతభావానికి పర్యాయపదమన్నారు. చిరంజీవి, పవన్ ఈ విషయాన్ని గమనించాలన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులు సంతోషించారని.. కొందరు కాపు నాయకులు ఆస్తులను కాదనుకొని పార్టీ కోసం కృషి చేశారన్నారు. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆ పార్టీ బుడగలా పేలిపోయిందన్నారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్కు అమ్ముకున్నారన్నారు.
చిరంజీవి కొట్టిన ఆ దెబ్బకు కాపులంతా ఆస్తులు పోగొట్టుకుని రోడ్డునపడ్డారని.. చిరంజీవి మాత్రం రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి తీసుకున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఓ మెంటల్ కేసని.. లోకేశ్ తన అవినీతితో రాష్ట్రాన్ని కబళించాడని విమర్శించారు. చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించగానే వెళ్లి ఆయన కాళ్లపై పడ్డారని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారని.. తద్వారా కాపుల్లో ఎవరూ ముఖ్యమంత్రిగా పనికిరారని పవన్ తేల్చేశారన్నారు. తాను కూడా సీఎంగా పనికిరానని పవన్ చెప్పుకుంటున్నారని.. గంపగుత్తగా కాపులందరి ఓట్లు చంద్రబాబుకు వేయించాలనేదే పవన్ ప్రణాళిక అంటూ పోసాని విమర్శించారు.