JC Prabhakar Reddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడెక్కిస్తోంది. కొద్దిరోజులుగా కేతిరెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్లి జేసీపై ఆధిపత్యం నిరూపించుకోవాలని అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఇవాళ ఎలాగైనా తాడిపత్రిలో అడుగుపెట్టాలని అనుకున్నప్పటికీ.. జేసీని పోలీసులు అడ్డుకున్నారు.
తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని మధ్యలోనే పోలీసులు ఆపేశారు. హైకోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ ఆయన్ను అనుమతించలేదు. కేతిరెడ్డిని ఇవాళ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో బందోబస్తుతో తాడిపత్రిలో దించాలని హైకోర్టు పోలీసులకు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. కాగా, హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తాడిపత్రి పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తాడిపత్రిలోకి కేతిరెడ్డిని అడుగుపెట్టనీయొద్దనే ఉద్దేశంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ శివుని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలు ఎదురెదురు పడితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భావించి.. జేసీ నివాసాలను కూడా పోలీసులు చుట్టుముట్టారు.