రాజమండ్రి : భారీ మొత్తంలో వరద నీటి ఇన్‌ఫ్లోతో పోలవరం ఈ ఏడాది చరిత్ర సృష్టించింది. గత శతాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా పోలవరానికి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్నది. ఆగస్టులో పోలవరానికి భారీగా వరద వస్తుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. మంగళవారం ప్రాజెక్టు కాఫర్ డ్యాం దగ్గర నీటిమట్టం 34.20 మీటర్లుగా నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం, ఎగువ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా అనుకున్న సమయం కన్నా నెల ముందుగానే ఇన్ ఫ్లో వచ్చిందని రాజమండ్రి రివర్ కన్జర్వేటర్, హెడ్ వర్క్స్ ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు.
తొలుత దిగువ కాఫర్ డ్యాం నీటిని నిల్వ చేసి పూర్తి చేయాలని అధికారులు భావించారు. అయితే ఊహించని విధంగా భారీగా వరద ప్రవాహం రావడంతో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంబంధిత స్పిల్‌వే పనులు పూర్తి కాగా, లోయర్ కాఫర్ డ్యాం, గ్యాప్-2 ప్రధాన డ్యామ్ సంబంధిత పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం గ్యాప్-2 ప్రాంతం మొత్తం జలమయమైంది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా పూర్తికాని పోలవరం ప్రాజెక్టులో కేవలం 194 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. మొత్తం ఇన్‌ఫ్లోలను సముద్రంలోకి వదిలేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బుధవారం నాటికి నీటిపారుదల ప్రాజెక్టులోకి 15 లక్షల క్యూసెక్కుల అదనపు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బీ సుధాకరబాబు తెలిపారు.
తుంగభద్ర డ్యాంకు భారీగా ఇన్‌ఫ్లో
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నాయి. డ్యామ్‌లోకి పెద్ద మొత్తంలో వరద నీరు రావడంతో అధికారులు మొదట ఐదు క్రస్ట్ గేట్లను సగటున 1.5 మీటర్ల ఎత్తుకు ఎత్తి 12,423 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 85,676 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యామ్‌లోకి ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు మరోసారి 10 క్రస్ట్ గేట్లను 1 మీటర్ ఎత్తుకు ఎత్తి 16,316 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. డ్యాం మొత్తం సామర్థ్యం 105.77 టీఎంసీలు కాగా.. డ్యాం నిల్వ మట్టం 96 టీఎంసీలకు చేరుకున్నది. వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ డ్యామ్ అధికారులు రెండో వరద హెచ్చరిక జారీ చేశారు.