అమరావతి : బాపట్ల (Bapatla) జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకై (Poison gas leak) 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం కంపెనీలోని పైపులైన్ నుంచి లీకేజీ ఏర్పడి విషవాయువు వెలువడింది. దీంతో అక్కడే పనిచేస్తున్న సుమారు 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతలోనయ్యారు (Workers sick) .
కార్మికులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు మండడం , కళ్లు ఎర్రగా కావడంతో వారిని నిజాంపట్నం , పిట్టవానిపాలెం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం అందించేందుకు బాపట్ల, గుంటూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఒక ప్రాంతంలో మాత్రమే విషవాయువు లీకైందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విషవాయువు లీకేజీలో యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యగాని ప్రసాద్ మాట్లాడుతూ బాధితులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.