అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి (MLA Pinnelli) రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని బాధితుడు శేషాగిరిరావు సుప్రీం కోర్టు (Supreme Court) మెట్లక్కారు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని బాధితుడు కోరారు. ఈవీఎం(EVM) ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని , కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే అవకాశముందని పిటిషన్లో పేర్కొన్నాడు.
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై బాధితుడు శేషగిరిరావు(Shesagiri Rao) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసంపై ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని, తీవ్ర ఘటనలకు బెయిల్ మంజూరు ఆందోళన కలిగిస్తోందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.
మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకున్నా ఆయన తరుఫున ఏజెంట్ కౌంటింగ్ పరిశీలించే అవకాశముందని సూచించారు. పిన్నెల్లి కౌంటింగ్ వద్ద ఉంటే మళ్లీ హింస జరిగే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నాడు. బాధితుడు శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.