అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్లు వేశారు. అధికారంలోకి రావాలని అనుకునే వాళ్లు తామేం చేస్తామో చెప్పాలి కానీ, ఎదుటి వారిపై విమర్శలు చేయడం కాదన్నారు. వేరే వ్యక్తిని సీఎంని చేయడం కోసం మనం పనిచేయాలని కేడర్‌కు ఏ పార్టీ అధినేత కూడా పిలుపునివ్వడని బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. పవన్ ప్రసంగంలో దూషణలు తప్ప.. విధానపరమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు.
వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. సినిమా డైలాగులు చెబితే ప్రజలు నమ్మరన్నారు. సినిమాకు, రాజకీయాలకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు వదిలేసి, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే కదా? నువ్వు ఓట్లు చీల్చకుండా చేయడానికి అని ఎద్దేవా చేశారు. వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినంత మాత్రాన ఓట్లు పడవని బొత్స అన్నారు.