అమరావతి : ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు నిర్ణయించుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆదివారం మరోసారి సమావేశం జరిగింది. ఉండవల్లిలోని నివాసంలో వీరిద్దరూ భేటి అయి సీట్ల సర్దుబాట్లపై చర్చించారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వరుసగా జరుగుతున్న సమావేశాల్లో దాదాపు సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలు కొందరు త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. సీట్లసర్దుబాటును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశముండడంతో టీడీపీ, జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నా ఆశావాహులంతా అధినేతల ప్రకటనపై ఎదురుచూస్తున్నారు.
కాగా అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు వారిని ఎన్నికలకు సంసిద్ధం చేశారు. తమ ప్రత్యర్థులింకా అభ్యర్థులను ఖరారు చేయడంలో మల్లగుల్లాలు పడుతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.