అమరావతి : తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారిలో కల్తీ నెయ్యి అంశంపై ఏపీలో అధికార, విపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది . మీ వైఫల్యమేనంటూ ఒకరు, కాదు కాదు వందరోజుల పాలనలో వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారంటూ ఇంకొకరు చేస్తున్నా ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
లడ్డూ వ్యవహారంలో మాజీ మంత్రి రోజా( Ex-minister Roja ) మొదటిసారి స్పందించారు. చంద్రబాబు (Chandra Babu) అబద్దపు ప్రచారాలపై ఆడిపోసుకుంటూనే పవన్‌కల్యాణ్(Pawan Kalyan) చేపట్టిన ప్రాయశ్చిత దీక్షపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. ప్రాయశ్చిత ఎవరు చేస్తారని ప్రశ్నించారు. తప్పుచేసినవారు చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తప్పును పవన్ కల్యాణ్ అంగీకరిస్తూ దీక్ష చేశాడని భావిస్తున్నామని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి ఉన్నపుడు తిరుమలను సందర్శించిన మోదీ, సీజేఐలు, చంద్రబాబు కుటుంబాలు ఆనాడు లడ్డూ నాణ్యతపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. కూటమి పాలనలో విషయం బయటకు వచ్చినందున అందుకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
వందరోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, దాడులు, వరదలో జరిగిన నష్టం నుంచి తప్పించుకోవడానికి లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.