అమరావతి : ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన అమన్ (Aman ) సెహ్రావత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అమన్‌కు శనివారం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రెజ్లింగ్ (Wrestling )విభాగంలో భారత క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమని పేర్కొన్నారు. అమన్ పతకం గెలవడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
శుక్రవారం భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ దేశానికి ఆరో పతకాన్ని అందించి భారత జెండాను రెపరెపలాడించాడు. మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్(Vinesh Poghat) అసమాన పోరాటంతో స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఫైనల్ పోరుకు కొన్నిగంటల ముందు ఆమె నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉందని ‘అనర్హత వేటు’ ఎదుర్కోవడంతో ఈ క్రీడలో పతకంపై ఆశలు అడుగంటిన వేళ అమన్ మాత్రం ఆ లోటును తన పతకంతో పూరించాడు.
పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో మాత్రం అదరహో అనిపించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమన్ 13-5తో క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను ఓడించి కంచు మోత మోగించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు పారిస్‌లో ఇదే తొలి పతకం కాగా మొత్తంగా ఆరోవది. వినేశ్ పతకం విషయంలో నిరాశగా ఉన్న భారత క్రీడాభిమానులకు అమన్ కాంస్యం కాస్త స్వాంతన కలిగించింది. అతడు తెచ్చింది కాంస్యమే అయినా ప్రస్తుత పరిస్థితులలో అది పసిడి కంటే ఎన్నో రెట్లు విలువైనదని క్రీడా పండితులు పేర్కొన్నారు.