అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చెందిన ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మత్స్యకార గ్రామాల్లో జనసేన నేతలు నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
జీవో 217 వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. తీరప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకుని ఈనెల 20వ తేదీన సమగ్రమైన నివేదికను పవన్ కల్యాణ్‌కు అందిస్తామన్నారు. నరసాపురంలో జరగబోయే బహిరంగ సభ ద్వారా మత్స్యకారులకు భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు.