Viral News | భార్యాభర్తల మధ్య సర్వసాధారణంగా గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ఒకరిపై ఒకరు తమ కోపాన్ని చూపిస్తుంటారు. ముఖ్యంగా భార్యలు అయితే అలిగి పుట్టింటికి వెళ్లిపోతారు.. లేదా నాలుగు రోజులు మాట్లాడరు.. అది కాకపోతే తమ ప్రతాపం మొత్తం వంటింట్లో గిన్నెల మీద చూపిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం భర్త మీది కోపంతో చేసిన పని తెలిస్తే షాకవుతారు. భర్తతో గొడవ తర్వాత ఆ భార్య ఏకంగా పెన్నులను మింగేసింది.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన 28 ఏళ్ల వివాహిత విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు చేసుకుంటూ ఉండటంతో శనివారం నాడు ఆమె కుటుంబసభ్యులు వినుకొండ రోడ్డులోని మాతాశ్రీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు ఆమెకు సిటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు చేయగా కడుపులో పెన్నులు ఉన్నట్లుగా తెలిసింది. దీంతో హుటాహుటిన ఆపరేషన్ చేశారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానం ద్వారా ఎటువంటి కోత, కుట్లు లేకుండా అరుదైన ఆపరేషన్ చేసి కడుపులో నుంచి నాలుగు పెన్నులను బయటకు తీశారు.
ఆపరేషన్ అనంతరం అసలు సదరు యువతి కడుపులోకి పెన్నులు ఎలా వెళ్లాయని వైద్యులు, సిబ్బంది ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. భర్తతో గొడవ జరగడంతో ఆ కోపంలోనే పెన్నులు మింగినట్లు తెలిసి అంతా అవాక్కయ్యారు.