అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను (Visakha Steel Plant) పూర్తిస్థాయిలో నడిపించేందుకు కేంద్రం మొదటి విడతగా ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Srinivasa Verma) పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈనెల 30న కేంద్ర మంత్రి కుమారస్వామి, తాను మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించనున్నామని స్పష్టం చేశారు.ప్లాంట్‌కు సంబంధించిన ఇతర అంశాలపై అధికారులతో చర్చలు జరుపనున్నట్లు వెల్లడించారు.
స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న బకాయిలు రూ.35 వేల కోట్లను ఒకేసారి ప్రకటిస్తేనే సమస్యకు ప్రయోజనం అనే ఆలోచన సరైనది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ( Central Government) మొదటి ప్రయత్నంగా రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. వీటితో ఆగస్టు నెలలోగా రెండు,మూడు బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తిగా పనిచేసి 7.3 మిలియన్ల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి చేరుకుంటే నష్టాలు పూడ్చుకోవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు.
ప్యాకేజీ ఆధారంగా గాడిలో పడిన తరువాత కేంద్రం మరోసారి సాయం చేస్తుందని తెలిపారు. సెయిల్‌లో విలీనం అంశాన్ని ప్రస్తావిస్తూ సెయిల్(SAIL) పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాదని, పబ్లిక్ రంగ సంస్థ అని అన్నారు. ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ అందజేస్తే ఆ తరువాత ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకుని సమర్ధవంతంగా నిర్వహించి విలీనం చేసుకుంటామని సెయిల్ చెప్పిందని తెలిపారు. ఆ తరువాత కూడా సెయిల్‌లో విలీనం అంశాన్ని స్టీల్‌ప్లాంట్, కార్మికుల ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.