అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై (Visaka Steel Plant) కేంద్ర ఉక్కు, గనులశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Verma) మరోసారి కేంద్రం వైఖరిని వెల్లడించారు. గురువారం నరసాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ హక్కు -ఆంధ్రుల హక్కును స్థానిక ప్రజలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నారని స్పష్టం చేశారు.
ఇటీవల కేంద్ర కేబినెట్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించేందుకు రూ. 11,440 కోట్లను ప్యాకేజీ కింద ప్రకటించిందని తెలిపారు. ప్లాంట్‌ను కాపాడేందుకు ప్యాకేజీ ఇచ్చిన తరువాత ఇక ప్రైవేటీకరణ (Privatization) అంశం లేనట్టేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు నుంచే కూటమి పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్‌ను అన్ని విధాల కాపాడుకుంటామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra babu) , తాను, కేంద్ర, రాష్ట్ర మంత్రులు , కూటమి నాయకులు ఈ విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నామని వివరించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి (Kumara Swamy) ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగబోదని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్లాంట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్యాకేజీని అందజేశారని కొనియాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ కేంద్రం తొలివిడతగా రూ.1,600 కోట్లను విడుదల చేయగా , ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 11,440 కోట్లను కేటాయిస్తుందని అన్నారు.
ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి కేంద్రం ఆర్థిక సాయం అందించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజల మనోభావాలను గౌరవించి ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుని, పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు.