అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సీఎంతో ఇవాళ ఉదయం భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా మాటను ఆలకించినందుకు జగన్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం హామీతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయగా.. ఏపీటీఎఫ్ మాత్రం ఈ ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదని వెల్లడించింది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధనలో ఉద్యోగ సంఘాలు తమను మోసం చేశాయని కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల తరఫున ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు తమను విస్మరించారని మండిపడ్డారు. వీరు 3 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేశారని విమర్శించారు. తమ నిరసనను తెలియజేసేందుకు సోమవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసినట్లు వారు తెలిపారు.
మరోవైపు, ఉపాధ్యాయులు కూడా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఐక్యపరిచి త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తామని వారు ప్రకటించారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన కమిటీ చేసిన చర్చలు ఆమోదయోగ్యం కాదని ఏపీటీఎఫ్ నేతలు చెప్పారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించామని, పాత హెచ్ఆర్ఏనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.