Tirupati- Hydraa | హైదరాబాద్‌లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలోనే తిరుపతిలో కూడా ఒక టీమ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. తిరుపతిలోని స్వర్ణముఖి నది ప్రక్షాళన కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వర్ణముఖి నది పరిరక్షణకు కొత్త జీవో తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో స్వర్ణముఖి నది వెంట భారీ ఆక్రమణలు జరిగాయని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఆరోపించారు. నదికి ఇరువైపులా ఉన్న భూములను ఆక్రమించుకున్నారని అన్నారు. తప్పుడు పత్రాలతో భూములను కాజేశారని.. నది బఫర్‌జోన్‌ను పట్టించుకోకుండా కబ్జా చేశారని విమర్శించారు. అందుకే స్వర్ణముఖి నది ప్రక్షాళనకు ఆపరేషన్ స్వర్ణ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, కబ్జాలను తొలగిస్తామని చెప్పారు. ఇందుకోసం హైడ్రా తరహాలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఆపరేషన్ స్వర్ణలో భాగంగా నదికి ఇరువైపులా డ్రోన్లను ఉపయోగించి సర్వే చేపడతామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. నది బఫర్ జోన్లో స్థలాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పేర్కొన్నారు. నదిలో ఇళ్లు కట్టడం వల్ల రెండేళ్ల క్రితం అపార నష్టం జరిగిందని.. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపమని మండిపడ్డారు. తుడా, మున్సిపల్, ప్రభుత్వ అధికారులతో కమిటీ వేసి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. ఆక్రమణలు చేసింది ఎంతటివారైనా వదిలేది లేదని హెచ్చరించారు. తుడాలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయ్యిందని తెలిపారు. సంస్థ నిధులు రూ.270 కోట్లు ఎంపీడీవో ఖాతాలకు మళ్లించి దోచుకున్నారని పేర్కొన్నారు.