అమరావతి : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(ontimitta kodanda ramaswamy)వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో(brahamotsavam) భాగంగా శుక్రవారం స్వామివారు శ్రీ కాళీయమర్దనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
అనంతరం తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు(temple officials) తెలిపారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు అశ్వవాహనం పై దర్శనం ఇవ్వనున్నారని వెల్లడించారు.
ఏప్రిల్ 8న చక్రస్నానం
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాడగాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.