AP Lands | ఏపీలో ఎక్కడైనా సరే భూమి కావాలంటే 99 పైసలకే దొరుకుతుందని వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి తెలిపారు. ఎకరం భూమి అయినా.. పదెకరాలు అయినా.. వందెకరాలు అయినా సరే 99 పైసలకే ఇస్తారని చెప్పారు. అయితే దానికి ఒకే ఒక్క కండీషన్ ఉందని.. కొనేవాళ్లు చంద్రబాబు, నారా లోకేశ్‌కు బినామీ లేదా బంధువర్గమో అయ్యి ఉండాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లిఫ్ట్ ( ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్) పేరుతో తీసుకొచ్చిన పాలసీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
తిరుపతి బస్టాండ్ దగ్గర కావాలా? విజయవాడ బస్టాండ్ సమీపంలో కావాలా? వైజాగ్ మధురవాడ ఐటీ హబ్‌లో కావాలా? భోగాపురం ఎయిర్‌పోర్టు పక్కన కావాలా? రాజమండ్రి పోర్టు పక్కన కావాలా? లేదంటే కర్నూలు ఓర్వకల్లు దగ్గర కావాలా? మీకు ఎక్కడ ఏ భూమి కావాలన్న కేలం 99 పైసలకే దొరుకుతుందని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. ఎకరం భూమి అయినా.. పదెకరాల భూమి అయినా.. 50 ఎకరాల భూమి అయినా.. వందెకరాల భూమి అయినా 99 పైసలకే దొరుకుతుందని చెప్పారు. కాకపోతే ఈ అవకాశం అందరికీ ఉండదని పేర్కొన్నారు. దీనికి ఒకే ఒక అర్హత ఉండాలని.. అది చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు బినామీనో.. బంధువర్గమో అయ్యి ఉండాలని స్పష్టం చేశారు.
ఏపీలో ఎక్కడైనా ఎకరం భూమి 99 పైసలకే..!
కానీ.. ఒకే ఒక కండీషన్. అది ఏంటంటే మీరు @ncbn లేదా @naralokesh కి బినామీలుగా అయ్యుండాలి
ఈ ఇద్దరికీ మీరు బినామీలు అయ్యి ఉంటే.. రాష్ట్రంలో ఎక్కడైనా.. ఎన్ని ఎకరాలైనా 99 పైసలకే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం ఆఫర్ ఇస్తోంది… pic.twitter.com/22OZwwBG6L
— YSR Congress Party (@YSRCParty) August 18, 2025
ఆ అర్హత ఉన్నవారికి బస్టాండ్ పక్కన కావాలన్నా.. రైల్వే స్టేషన్ పక్కన కావాలన్నా.. ఎయిర్‌పోర్టు పక్కన కావాలన్నా.. ఏకంగా బస్టాండే కావాలన్నా ఇచ్చేస్తారని కారుమూరి తెలిపారు. ఏపీలో ఎక్కడ భూమి కావాలన్నా 99 పైసలకే ఇస్తారని.. దీనికోసం ఈ నెల 16వ తేదీన జీవో నెం.32 తీసుకొచ్చారని చెప్పారు. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ (లిఫ్ట్)పేరుతో ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ భూములను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఫార్చ్యూన్ 500 యూరప్ జాబితాలోని 500 కంపెనీల్లో ఉంటే ఈ పాలసీ వర్తిస్తుందని చెబుతున్నారని.. కానీ ఆ 500 కంపెనీల్లో చాలా వరకు నాన్ ఐటీ కంపెనీలే ఉన్నాయని తెలిపారు. దాంట్లో స్విట్జర్లాండ్‌కు సంబంధించిన 36 కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఎన్ఎస్ఆర్ అనే బెంగళూరు కంపెనీకి మధురవాడలో10 ఎకరాలను 99 పైసలకే అంటగట్టారని చెప్పారు. ఇలా బినామీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వాళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే, ప్రభుత్వ భూములతో పాటు మన ప్రైవేటు భూములను కూడా లాక్కొనే ప్రయత్నానికి శ్రీకారం చుడతారని ఆరోపించారు.