కర్నూలు: గుప్తనిధుల కోసం విజయనగర రాజుల కాలం నాటి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. పురాత దేవాలయాన్ని తవ్వడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పత్తికొండ మండలం రాజుల మండగిరి గ్రామంలో విజయనగరం రాజుల కాలంనాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడి బుగ్గల అమ్మ దేవతామూర్తి సమాధుల్లో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నాయన్న నమ్మకంతో కొందరు దుండగులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం అటువైపుగా వెళ్లిన గ్రామస్థులు తవ్వకాలను గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని రాజుల మండగిరి గ్రామస్థులు చెప్తున్నారు. పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా గుప్తనిధుల తవ్వకాలు సర్వసాధారణమైపోయాయని వీరు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వెనక ఎవరున్నారో తేల్చేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపాలని వారు కోరుతున్నారు.