అమరావతి : ‘ మందు బాబులం. మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహా రాజులం’ అంటూ ఏపీకి చెందిన మందుబాబులు హుషారుగా చిందులు వేస్తున్నారు. పాత మద్యం బ్రాండ్లు మళ్లీ వైన్స్లో విక్రయిస్తుండడంతో వారిలో పట్టలేని సంతోషం కనిపిస్తోంది.
ఈనెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని (New Liquor Policy) తీసుకొచ్చి అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా గత వైసీపీ(YCP) హయాంలో ఉన్న కొత్త బ్రాండ్లను తీసివేసి వాటి స్థానంలో ఎప్పటి నుంచో ఉన్న పాత బ్రాండ్లను అందుబాటులో ఉంచడం పట్ల మద్యం ప్రియులు(Alcohol lovers) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెక్డోల్ విస్కీ, రాయల్ స్టాగ్, రాయల్చాలెంజ్, కింగ్ ఫిషర్, ఓల్డ్ మాంక్, మెన్షన్ లాంటి బ్రాండ్లో మళ్లీ విక్రయిస్తుండడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాత బ్రాండ్లు దొరకలేదని మందుబాబు ఒకరు పేర్కొన్నారు. అప్పటి సరుకులో నాణ్యత లేకపోవడం వల్ల కాళ్లు, చేతులు లాగేసేవని తెలిపారు. మందు తాగిన తరువాత అరగంటలోనే మత్తు ఎక్కి సైకో లాగా ప్రవర్తించేడి వారని వెల్లడించారు. ఇప్పుడు నాణ్యమైన సరుకు అందుతుందని తెలిపారు.
అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ. 99 లకే నాణ్యమైన మద్యం ఇంకా అందుబాటులోకి రాకపోవడంపై మరి కొందరు మందుబాబులు కూటమి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.