అమరావతి : ఆషాఢ మాసంలో నిర్వహించే అమ్మవారి పండుగలో భాగంగా ఇవాళ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో తెలంగాణ మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం, సారె సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి కళాకారులు ఆటలు, పాటలు పాడుతూ బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ ఈవో భ్రమరాంబ, స్థానచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత 13సంవత్సరాలుగా కనకదుర్గా అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారికి తెలంగాణ తరుఫున సారెను సమర్పించి 31 బోనాలతో ఊరేగించి పూజలు నిర్వహించామని తెలంగాణ కమిటీ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణకు చెందిన కమిటీ సభ్యులు, కళాకారులు దుర్గాఘాట్ వద్ద గంగ తెప్ప పూజలు నిర్వహించారు.
లయబద్ధమైన డప్పుచప్పుళ్లకు అనుగుణంగా రంగురంగుల పోతరాజుల నృత్యాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఆలయ ప్రాంగణం వరకు ఊరేగింపు నిర్వహించారు. అన్నం, బెల్లం, పెరుగుతో తయారు చేసిన సంప్రదాయ బోనాలను తలపై పెట్టుకుని మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చారు.