పశ్చిమ గోదావరి జిల్లా: జనసేన పార్టీ నుంచి తనను ఎవరూ సస్పెండ్ చేయలేరని చెప్పారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. అంత ధైర్యం కూడా పార్టీలో ఎవరికీ లేదన్నారు. తనకు తాను జనసేన భీష్ముడిగా పోల్చుకున్న బొలిశెట్టి శ్రీనివాస్.. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. బొలిశెట్టి శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వారిని ఉద్దేశించి.. దమ్ముంటే మీ పేరు పెట్టండని సవాల్ విసిరారు. తాను చావాలి అనుకుంటే తప్ప తనకు చావు లేదన్నారు. జనసేన భీష్ముడిని పార్టీ నుంచి తొలగించే ధైర్యం ఎవరూ చేయరన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఫేక్ వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. దొంగ టెండర్లు వేసి స్థలాలు కబ్జా చేసే వాడిని కాదని.. సొంత డబ్బుతో ప్రజాసేవ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ట్రోల్ అవుతున్నాయి. ఇలా ట్రోల్ చేసేవారికి త్వరలోనే సమాధానం చెప్తానన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు ఇలా ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని బొలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.