తిరుపతి : తిరుపతి సంస్కృత వర్సిటీలో విద్యార్థిని పై లైంగిక దాడి పట్ల ఏపీ హోం మంత్రి వంగలపుడి అనిత(Home Minister Anitha ) స్పందించారు. బాధిత విద్యార్థికి( Students) న్యాయం చేస్తామని, కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణే తమ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నానని, బాధితురాలి నుంచి పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని వెల్లడించారు. కేసును తిరుపతి ఎస్పీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పూర్తిస్థాయి విచారణ కోసం పోలీసుల బృందం ఒడిశాకు వెళ్లిందని తెలిపారు.
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన యువతి బీఎడ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ (Assistant Professor Laxman Kumar) లైంగికంగా వేధింపులకు గురి చేసి, శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా ఆ దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.
ఆ తర్వాత ఇద్దరూ ఆ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేయగా.. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్ఫోన్లను సీజ్ చేశారు . ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు ఒడిషాకు వెళ్లిపోగా ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మన్కుమార్ను విధుల నుంచి తొలగించింది.