Bhumana Karunakar Reddy | జగన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతోందని తెలిపారు. అలాంటిది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌ను డిక్లరేషన్ అడగడం దారుణమని విమర్శించారు.
జగన్ తిరుమలకు వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని అన్నారు. దేవుడిపై భక్తి లేని వారు జగన్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు. జగన్‌పై గతంలో లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకు అని ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు నీచ రాజకీయాలు ఆపాలని హెచ్చరించారు.
జగన్ డిక్లరేషన్‌పై ఇంత రాద్దాంతం జరిగినా చంద్రబాబు మాట్లాడటం లేదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పాశవిక విధానాలను వ్యతిరేకిస్తూనే ఉంటామని భూమన తెలిపారు. చంద్రబాబు వెయ్యి నాలుకల ధోరణిని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
పవన్ కల్యాణ్ హైందవధ్వజ స్తంభం మాదిరి ఫీలవుతున్నారని భూమన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక మాట.. పవన్ కల్యాణ్ మరో మాట మాట్లాడుతున్నారని.. చంద్రబాబు శిష్యులు అయితే జగన్‌ను తిరుమలకు రానివ్వమని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారని విమర్శించారు. హిందువులంటే బీజేపీ అన్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారని తెలిపారు.