అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ ఫిక్సేషన్పై జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్సింగ్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో పనిచేసే ఉద్యోగులకు కొత్త జీతాలపై మన్మోహన్ సింగ్ కమిషన్ సిఫారసు చేయనున్నది. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ మార్చి 31 తో ముగియనున్నది.
విద్యుత్ శాఖలో పేస్కేల్ ఫిక్సేషన్ కోసం రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కమిషన్ను జగన్ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ త్వరలోనే పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితమే వెల్లడించారు. కొత్త పీఆర్సీ కమిటీపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేస్తామని ఆయన చెప్పినట్లుగానే.. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై రగడ ఒకవైపు నడుస్తుండగా.. మరోవైపు విద్యుత్ శాఖ ఉద్యోగులకు పీఆర్సీ తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేతమని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే సరైన న్యాయం చేయలేని ప్రభుత్వం.. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీతో తల గోక్కోవడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.