అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం పాలసీని ( Liquor policy) అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వెల్లడించారు. ప్రజలకు తక్కువ ధరకు, నాణ్యమైన మద్యాన్ని విక్రయించేందుకు మద్యం పాలసీని తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త మద్యం పాలసీపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committe) బుధవారం విజయవాడలో భేటీ అయ్యింది.
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్ర ఆదాయనికి గండిపడేలా మద్యం పాలసీని తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రజలకు నాసిరకం మద్యం సరఫరా చేసిం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుందని విమర్శించారు. జే బ్రాండ్ పేరిట ప్రజలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.