New Flights : విమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ టు విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. దాంతో ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్లు అవుతున్నాయి.
అందుకే కొత్తగా మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను నేడు (ఆదివారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 10.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు (విజయవాడ) చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. అదేరోజు రాత్రి తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుతుంది. మరో ఫ్లైట్ సర్వీసు అయిన ఇండిగో విమానం రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. రాత్రి 8.20 గంటలకి విశాఖపట్నం చేరుతుంది.
అదే సర్వీసు తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ రెండు కొత్త విమాన సర్వీసులతో కలిపి విశాఖ టు విజయవాడ మధ్య తిరిగే ఫ్లైట్ సర్వీసుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఫ్లైట్ సర్వీసులతో విశాఖ టు విజయవాడ మధ్య ప్రయాణించే వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.