అమరావతి : ఏపీలోని విశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై ఇండియన్ నేవీ విశాఖ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కోరింది. తప్పుడు సమాచారంతో మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్‌ను రెస్క్యూకి అత్యంత ఖర్చును వినియోగించవలసి వచ్చిందని స్పష్టం చేసింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.తమ స్వార్థం కోసం ఇంత ప్రజా ధనాన్ని, అధికారుల సమయాన్ని వృథా చేయడం సరైంది కాదంటూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
అసలేం జరిగిందంటే.. సాయిప్రియ దంపతులకు జూలై 25న పెళ్లిరోజు కావడంతో వారిద్దరూ విశాఖలోని ఆర్కే బీచ్‌కు వచ్చారు. భర్త సెల్‌ఫోన్ లో వచ్చిన మెసేజ్‌ను చూసే సమయంలో సాయిప్రియ అక్కడి నుంచి అదృశ్యమైంది. కొద్దిసేపటికి తన భార్య కనిపించడం లేదంటూ బహుశా సముద్రం అలలకు కొట్టుకుపోయిందని కోస్ట్‌గార్డు పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేశారు. మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ సహాయంతో సముద్రమంతా 24 గంటల పాటు జల్లెడ పట్టారు.
ఈ సమయంలో తాను నెల్లూరు ప్రియుడితో ఉన్నట్లు సమాచారం అందడంతో గాలింపును నిలుపుదల చేశారు. తప్పుడు సమాచారంతో అధికారులను, పోలీసులను ఇబ్బంది పెట్టినందుకు గాను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నెల్లూరుకు వెళ్లి సాయిప్రియను విశాఖకు తీసుకొచ్చి విచారించగా తప్పును ఒప్పుకుంది. తప్పు చేసినందకు మన్నించమని అధికారులను కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.