అమరావతి : ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై (Indrakiladri ) రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు (Navratri celebrations ) ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సుమారు 13 లక్షల నుంచి 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని ఈవో రామారావు(EO Ramarao) తెలిపారు.
ఈసారి ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. లేజర్ షో, కృష్ణమ్మ హారతులు 12న తెప్పోత్సవం, పూర్ణాహుతితో నవరాత్రులు ముగుస్తాయని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని గురువారం నుంచి అంతరాలయం దర్శనాలు ఉండవని అన్నారు.
ఉత్సవాల నిర్వహణ విషయంలో గతేడాది లోపాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే క్యూలైన్లు, స్నానఘాట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతిచోటా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.