ఏలూరు: వచ్చే విద్యాసంవత్సరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫిషరీస్ వర్శిటీ ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భవన నిర్మాణం పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్నాయి. దాంతో 2022-23 నుంచి కోర్సులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో నరసాపురం మత్స్య విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ఓ సుధాకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం నరసాపురంలో పర్యటించి తాత్కాలిక అద్దె భవనాలను పరిశీలించింది. పట్టణంలోని పీచుపాలెం, పాత నవరసపురం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రెండు ఇంజినీరింగ్ కళాశాలలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు పరిశీలించారు.
భవనాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. సారిపల్లిలో అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్ బ్లాకులను ఇప్పటికే మంజూరు చేసిన రూ.100 కోట్లతో ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రసాదరాజు తెలిపారు. అన్ని అనుమతులు మంజూరైనందున వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని ఆయన అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమంగా, దేశంలోనే మూడోదిగా ఏర్పాటుకానున్న మత్స్య విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.