Nara Lokesh | నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు నారా లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేశ్‌నే అని కుండబద్ధలు కొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుగానే టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడితో కలిసి మంత్రి టీజీ భరత్ స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జ్యురిక్లో పెట్టుబడిదారులు, తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి టీజీ భరత్ మాట్లాడుతూ.. జగన్ హయాంలో ఏపీలో పరిశ్రమలు పెడితే, పెట్టుబడులు పెడితే ఏమవుతుందనే అనుమానం ఉందని అన్నారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయనివాడు ప్రజలకుఏం చేస్తాడని జగన్‌పై విమర్శలు గుప్పించారు. మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్యావంతుడని తెలిపారు. ఏపీ రాజకీయ నాయకుల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివింది నారా లోకేశ్ ఒక్కడే అని చెప్పుకొచ్చారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేశ్ అని అన్నారు.
చంద్రబాబు నాయుడు ముందే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించిన మంత్రి టీజీ భరత్
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్
హైలీ ఎడ్యుకేటెడ్.. ఏపీ రాజకీయ నాయకుల్లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివింది లోకేష్ ఒక్కడే – మంత్రి టీజీ భరత్ https://t.co/fbZ33PUVNF pic.twitter.com/L3fOyhnk6X
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవదవ్దని, మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని హెచ్చరించింది.