Srisailam | శ్రీశైలం : శ్రీశైలంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రత కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. శ్రీశైలం వన్ టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిశీలిసరాలను పరిశీలించిన ఆయన.. పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు బాధితులు నిర్భయంగా వచ్చి వారి సమస్యలను తెలిపే వాతావరణ కల్పించడంతో పాటు మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
ఓపికతో సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉండేలా చూడాలని.. ఆలయ పరిసరాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దైవదర్శనం నిమిత్తం ప్రతిరోజు వస్తూ వెళ్తుంటారని.. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చూడాలని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అడ్డుకట్ట వేయాలన్నారు.
పెండింగ్ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు విషయంలోనూ, నేరస్తులను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. శ్రీశైలం ఆలయంలో ఉత్సవాలు, ప్రత్యేక సమయాల్లో భద్రత పటిష్టంగా చూడాలని.. వీఐపీ, వీవీఐపీలు దర్శనం కోసం వచ్చిన సమయంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతిరోజు విజిబుల్ పోల్ సింగ్ నిర్వహిస్తూ గంజాయి, మద్యం అక్రమ రవాణా జరగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా వేయాలన్నారు. స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర, అనుమానితులపై దృష్టి సారించాలని.. శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా అందరూ పనిచేయాలన్నారు. అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్ ఉన్నారు.