Srisailam Temple | శ్రీశైలం : త్రయోదశి సందర్భంగా బుధవారం శ్రీశైల క్షేత్రంలో నందీశ్వరస్వామి పరోక్షసేవల్లో భాగంగా విశేష అర్చనలు నిర్వహించారు. ప్రతీ మంగళవారం, త్రయోదశి రోజుల్లో సర్కారీ సేవగా ఈ కైంకర్యాలు నిర్వహించడం ఆవాయితీగా వస్తున్నది. ప్రతి నెలలో త్రయోదశి రోజుల్లో అనగా శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం పరోక్ష సేవలో 21 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ పరోక్షసేవలో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ విశేషపూజను నిర్వహించుకుంటున్నారు. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పం చెప్పారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను జరిపించారు.
ఆ తర్వాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, ఫలోదకాలు, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. చివరగా నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించి.. వృషభసూక్తం సహా పలు వేదమంత్రాలను పఠించి విశేష అభిషేకం నిర్వహించారు. చివరగా నందీశ్వరస్వామివారికి నూతనవస్త్రాలు, నానబెట్టిన శెనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. త్రయోదశి రోజున జరిగే నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116 సేవ రుసు సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. srisailadevasthanam.org, aptemples.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని.. నందీశ్వరస్వామివారి ఆరాధనతో సంతాన ప్రాప్తి, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, రుణబాధలు తీరుతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొంటున్నారు. వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 8333901351/52/53 సంప్రదించవచ్చన్నారు.