Balakrishna | ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయనివారంతా.. పీపీపీ మోడల్‌పై కొత్త నాటకాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో ఆదివారం బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందూపురం నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు ఇంకా అధికారంపై యావతో ఉన్నారన్నారు.
గతంలో వైద్య కళాశాలల అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని.. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రావాలనే ఉబలాటంతో ఏవేవో ఊహించుకుంటూ మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యంగా వైద్య విద్యాసంస్థలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. హిందూపురం నియోజకవర్గాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమేనని తన లక్ష్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దిశగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం దవాఖానల్లో మరికొన్ని అధునాతన పరికరాలను ఏర్పాటు చేయిస్తానన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త పరిశ్రమలు తీసుకువస్తామని.. తెలిపారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ ఇండస్ట్రీలు హిందూపురానికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారని.. ఈ కొత్త పరిశ్రమలు రావడంతో నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.