Tirumala | టీటీడీ ఉద్యోగులు అందరికీ తొందరలోనే నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నేమ్ బ్యాడ్జ్ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని సులువుగా గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
శ్రీనివాసుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ నేమ్ బ్యాడ్జిని త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత సర్వదర్శనం కోసం ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. అదే టైమ్ స్లాటెడ్ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. బుధవారం నాడు 67,284 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.27 కోట్లు ఆదాయం వచ్చింది.