TTD Chariman | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీని చిత్తుగా ఓడించి.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంతో నామినేటెడ్ పదవులను ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు.. కాబట్టి ఆయన విజ్ఞప్తి మేరకు టీటీడీ పదవిని నాగబాబుకే చంద్రబాబు ఇస్తారని అంతా అనుకుంటున్నారు.
ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కనివినీ ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించింది. అ విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని మొదట్నుంచి టీడీపీ, బీజేపీ పార్టీలను పొత్తుల వైపు ఒప్పించాడు. ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశారు. పొత్తు ధర్మం కోసం తనకు పట్టున్న నియోజకవర్గాలను వదిలేశాడు. ఆఖరికి తన సోదరుడు నాగబాబు పోటీ చేద్దామని అనుకున్న ఎంపీ స్థానాన్ని కూడా త్యాగం చేశారు. చివరకు తాను అనుకున్నట్టుగానే వైసీపీని చిత్తుగా ఓడించి ఏపీ రాజకీయాల్లో ఒక గేమ్ ఛేంజర్‌గా మారారు.
ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం చేపట్టనుండటంతో తన సోదరుడు నాగబాబుకు ఎలాగైనా న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ పదవిని తన సోదరుడు నాగబాబుకు ఇవ్వాలన్న డిమాండ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంచాడట. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్‌మీడియాలో మాత్రం ఈ విషయం వైరల్‌గా మారింది. అయితే వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్‌కు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం అవుతుంది. మరి టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి!
నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ.. తమ్ముడికి అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తు ధర్మంతో పవన్ కల్యాణ్ ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ జనసేన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది కాబట్టి.. తన సోదరుడికి ఎలాగైనా మంచి పదవి అప్పగించాలని పవన్ కల్యాణ్ చూస్తున్నాడు. అందుకే టీటీడీ చైర్మన్ పదవి కోసం పట్టుబట్టారని సమాచారం.