AP News | ఏపీలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ కలవరపెడుతున్నది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించే కోళ్లు.. ఉదయం వరకు అనారోగ్యంతో మృత్యువాతపడుతున్నాయి. అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో లక్షల రూపాయల నష్టం వస్తుందని కోళ్ల ఫారాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
H15N వైరస్ లక్షణాలతోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయని తెలుస్తోంది. డిసెంబర్లోనే ఈ వైరస్ మొదలైంది. సంక్రాంతి సమయంలో అంటే జనవరి 13 వరకు ఈ వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని ఒక అంచనా. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కోళ్లకు ఈ H15N వైరస్ రావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2012, 2020లో కూడా ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. నాలుగేళ్ల క్రితం ఈ వ్యాధి సోకిన అనేక కోళ్లు మృత్యువాతపడ్డాయి. అప్పుడు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయం నెలకొంది. వైరస్ సోకి కోళ్లు మరణిస్తున్నాయనే వార్త బయటకు రాగానే అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో చికెన్ ధరలు భారీగా దిగొచ్చాయి. అప్పుడు వైరస్ సోకడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వైరస్ సోకిన కోడికి లక్షణాలు ఏమీ కనిపించవు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరుగుతున్నట్టే కనిపించి.. ఉన్నట్టుండి చనిపోతుంది. ఈ వైరస్ సోకితే దాని ప్రభావం నేరుగా గుండెపైనే ఉంటుందని పశువైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన కోడికి గుండెనిండా నీరు పట్టేయడం వల్ల గుండెపోటు వంటిది సంభవించి చనిపోతాయని పేర్కొంటున్నారు. వైరస్ సోకిన కోడిని గుర్తించి వ్యాక్సిన్ వేసినా ఫలితం ఏ మాత్రం ఉండదని అంటున్నారు.