తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) రెండో రోజు శనివారం ఉదయం మలయప్పస్వామివారు(Malayappa Swamy ) ఐదు తలల చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి అని అర్చకులు వెల్లడించారు. స్వామివారు ఈరోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.