ఒంగోలు: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా మారనున్నాయి. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో హర్షాతిరేకలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విభిన్నంగా స్పందించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు నిర్ణయం శుభపరిణామమని పేర్కొంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతమున్న 5 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని గతంలోనే తాను సీఎం జగన్కు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఇదే విషయమై మరోసారి సీఎం జగన్ ను కలిసి వినతిపత్రం ఇస్తానని మాగుంట తెలిపారు.
అయితే, ప్రస్తుతం 26 జిల్లాలు ఏర్పడుతుండగా.. 35 జిల్లాలుగా పునర్విభజన జరిపితే పరిపాలనా సౌలభ్యానికి మరింత బాగుంటుందని పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలపాలని మాగుంట కోరారు.