అమరావతి : కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు 25 వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే . తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు ఈ అవకాశం కల్పించింది. అయితే తన బెయిల్‌ను మరో 11 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఇవాళ ఆయన హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కొద్ది సేపట్లో పిటిషన్‌పై వాదనలు జరుగనున్నాయి.
మరోవైపు అతడి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రేపు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ సాగనుంది. మే 19న రాత్రి కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం అనంతబాబు మే 23న అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. మూడు నెలలుగా పోలీసులు హత్య కేసుపై ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు.