తిరుపతి: టీడీపీ నేత వేధింపులు తాళలేక విజయవాడ బాలిక ఆత్మహత్యకు పాల్పడటంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న వార్త విని తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. మహిళలను ఇలా వేధిస్తున్న టీడీపీ.. నారీ సంకల్ప దీక్షను ఎలా చేపడుతుందని రోజా ప్రశ్నించారు.
టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వయసున్న 60 ఏండ్ల వ్యక్తి వేధింపులకు గురిచేశాడనే బాధను బాలిక తన పుస్తకంలో రాసుకున్నది స్పష్టంగా కనిపిస్తున్నదని ఆమె అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక తన సూసైడ్ నోట్లో రాసినట్లు రోజా తెలిపారు.
కాగా, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కూడా బాలిక ఆత్మహత్య ఘటనపై స్పందించారు. బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర బాధాకరమని అన్నారు. టీడీపీ నేత వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక సూసైడ్ నోట్ రాసిందని, ఆ నోట్ ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు.