అమరావతి : వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ( MLA Kolikapudi Srinivas ) ఈసారి సొంత పార్టీకి చెందిన ఎంపీపై అవినీతి ఆరోపణలు చేసి కలకలం సృష్టించాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని ( MP Kesineni Chinni) రూ. 5 కోట్లు డిమాండ్ చేయగా వివిధ రూపాల్లో వాటిని అందజేసినట్లు వాట్సప్‌లో బ్యాంక్ స్టేట్మెంట్ను బహిర్గతం చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తుంది.
రూ.60లక్షలను తన అకౌంట్ నుంచి, మిగతావి ఎంపీ పీఏ మోహన్‌కు తన స్నేహితులు అందజేశారని ఆరోపించారు. ఈ విషయంలో నిజం గెలవాలి.. నిజమే గెలవాలంటూ పోస్టు చేశారు. అయితే కొలికపూడి అబద్దాలు ఆడుతున్నారని ఎంపీ చిన్ని ఖండించారు. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తానేంటో విజయవాడ ప్రజలకు తెలుసని అన్నారు. కొలికపూడి గతంలో తనను దేవుడిగా పోల్చి నేడు దయ్యంగా వర్ణిస్తుండడాన్ని తప్పుబట్టారు.
కాగా ఇరువురి మధ్య వివాదంపై టీడీపీ అధిష్టానం వెంటనే స్పందించింది. కొలికపూడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇరువురితో శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీరిద్దరు వివాదాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.